పూజ్య యోగినీ

శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ

సుమారు 1960 ప్రాంతాలలో శ్రీ బాబూజీ ఒక ఆధ్యాత్మిక చర్చలో ఉండగా వారి వడిలో ఒక చక్కని పాప ఆడుకుంటూ ఉంది. ఆ పాప కూడా వారితోపాటు చేతులు త్రిప్పుతూ ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. శ్రీ బాబు ఆ పాప బుగ్గలు నిమురుతూ "చందూ! నువ్వు కూడా ఉపన్యాసం చెబుతావా?" అని అడిగారు. ఆ పాప నవ్వుతూ "అవును బాబూ!" అంది. శ్రీబాబు ఆ పాప తల నిమురుతూ భవిష్యత్తులోకి చూస్తున్నట్లుగా "నువ్వు నీ మనోరంజకమైన గాత్రంతో భగవన్నామాన్ని గానం చేస్తూ ఎందరో భక్తుల సందేహ నివృత్తి చేస్తూ వారిని దివ్యత్వం వైపు నడిపేలా బోధ చేస్తావు" అన్నారు. ఆ చిన్నారి పాపాయే కీ.శే. శ్రీ చిరంజీవి రాజుగారు, శ్రీమతి రాఘవమ్మగార్ల గారాలపట్టి కుమారి చంద్రశేషమాంబ. నిజానికి ఆ పాప తన తల్లిదండ్రులకు శ్రీ బాబూజీ దివ్యప్రసాదమే. ఆమె భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా శ్రీ బాబు ఒడిలోనే పెరిగారు. శ్రీ బాబు మార్గదర్శకత్వంలో ఆమె సంస్కృత వాజ్ఞ్మయంలో ప్రత్యేక శిక్షణ పొందారు. శ్రీబాబు పర్యటనలన్నింటిలో ఆమె వెన్నంటే ఉండేవారు. ఆమె తమ వారసురాలిగా, ఆశ్రమాధిపతిగా ఎదగాలనే ఆశయంతో శ్రీ బాబు ఆమెకు ప్రత్యేక శిక్షణ, ప్రేరణ, పరిపూర్ణతలను అనుగ్రహించారు.

అలా ఆమె శ్రీ బాబు ఆదేశానుసారం వారి మహాసమాధి అనంతరం "పూజ్య యోగినీ శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ" అనే నామధేయంతో శ్రీ కాళీ గార్డెన్స్ ఆశ్రమాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అలా మనం శ్రీ మాతాజీలోనే శ్రీ బాబూజీని దర్శించుకుంటున్నాం. శ్రీబాబూజీ వాక్కును ఆమెద్వారా వినగలుగుతున్నాం, శ్రీబాబూజీ ఆశీస్సులను కూడా ఆమెద్వారానే పొందుతున్నాం. అప్పటినుండి ఆశ్రమంలో అన్ని కార్యక్రమాలు శ్రీబాబుజీ కాలంలో జరిగినంత వైభవంగా శ్రీ మాతాజీ సమర్థ నేతృత్వంలో జరుగుతున్నాయి. అలాగే శ్రీ మాతాజీ ఆధ్యాత్మిక వికాసమనే కర దివిటీని చేకొని మనందరినీ శ్రీ బాబు దివ్య పాదసన్నిధికి చేరుస్తారనే నమ్మకం ప్రతిఒక్కరికీ ఉంది.