నీవు ఈ నశ్వరమైన శరీరానివి కావు, అవినాశివియైన ఆత్మవే నీవు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు కలిగే ఆత్మానందం ముందు ప్రాపంచిక విషయానందాలు ఏపాటి? అఖండమై, సర్వవ్యాపకమై, సర్వశక్తివంతమై, సర్వజ్ఞమైన అట్టి ఆత్మవస్తువే 'నేను'. అయితే అట్టి యోగి తాను పొందిన ఆత్మానందాన్నే ఇతరులకు ప్రేరణ కలిగించి, వారిని సాధన మార్గంలో మార్గదర్శియై నడిపించి వారిచే పొందించినప్పుడు , వారి ముఖాలలోని ఆత్మానందాన్ని చూచి అతను పొందే ఆనందం ఆ ఆత్మానందానికన్నా ఎన్నోరెట్లు అనంతమై, అతుల్యమై ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గదర్శియైన గురువు తన వ్యక్తిగత ఆనందం కన్నా అట్టి సమష్టి ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.
శ్రీబాబు కఠినమైన నిబంధనలను, సిద్ధాంతాలను ఏమీ బోధించరు. వారు కేవలం తమ శిష్యులను అత్యుత్తమమైన మానవ జన్మ లభించినందుకు దానిని సార్థకం చేసుకొని జనన మరణ విషవలయం నుండి తమకు తాముగా బయటపడమని, అందుకు అతి సరళమైన, అమలినమైన, ఆధ్యాత్మిక జీవనమే మార్గమని బోధిస్తారు. వారి ఆలోచనలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడమంటే కుటుంబంపట్ల, వృత్తిపట్ల, సమాజంపట్ల తన బాధ్యతలను వదలివేయమని కాదు. నిజానికి వారు ఆయా బాధ్యతలన్నింటినీ హృదయపూర్వకంగా, నిబద్ధతతో ఎవరికీ ఎట్టి హానీ కలిగించకుండా ధర్మపరమైన మార్గంలో నెరవేర్చమని బోధిస్తారు. నిజానికి ఎంతటి తీరికలేని జీవితంలోనైనా ప్రతి వ్యక్తికీ కొద్దిసేపు ధ్యానము ప్రార్థన చేసుకోవటానికి తప్పక సమయం దొరుకుతుంది. అయితే తాను బద్ధకానికి చోటివ్వకుండా ఉండాలి. ఎందుకంటే సోమరితనమే అజ్ఞానం/మృత్యువు .
విశ్వాసంతో కూడిన ప్రార్థన స్థితప్రజ్ఞతను, అంతఃకరణ శుద్ధిని కలిగిస్తుంది. భగవంతుని (ఆయన రూపమే అయిన గురుదేవుని) పాదపద్మములయందు ఏకాగ్ర భక్తి, అచంచల విశ్వాసాలు తప్పక మన బాధలన్నింటినీ రూపుమాపి మనను మన చరమలక్ష్యానికి చేరుస్తాయి - ఇది శ్రీ బాబు ఇచ్చిన హామీ.
శ్రీబాబు దివ్య సన్నిధిలో ఆశ్రయం పొందే జనులు క్రమక్రమంగా ఎక్కువ అవుతూ ఉండటంతో ఒక ఆశ్రమం నిర్మించటం, అందులో సదా కొలువై ఉండి తమ మార్గదర్శనంతో సదా భక్తులకు అందుబాటులో ఉండవలసిందిగా శ్రీబాబును ప్రార్థించటం అనివార్యమైంది. అలా 1972లో శ్రీ బాబూ విజ్ఞాన మందిరం వెలసింది. ఈ ఆశ్రమంలో కుల, వర్ణ, జాతి, లింగ భేదాలు ఏమాత్రమూ లేవు. అన్ని వర్గాల భక్తులూ ఇక్కడ కలసిమెలసి జీవిస్తూ సహపంక్తి భోజనం చేస్తారు. ఈ దివ్యక్షేత్రం నుండి ప్రతిధ్వనించే శ్రీబాబు వాక్కులద్వారా ఆధ్యాత్మికామృతం అలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలా వారి దివ్యబోధ వారి దివ్య సంసర్గంలోకి వచ్చి, వారి అభయ దృక్కులలో తడిసి, వారి మృదు కరస్పర్శను అనుభవించిన వారందరినీ ఉత్తేజితం చేస్తూనే ఉంటుంది. ఉదయ, సాయం సంధ్యలలో ప్రార్థన, ఉపనిషత్, గీతా పారాయణ, సంకీర్తన, రామాయణ, భాగవతాది పురాణ ప్రవచన, ఆధ్యాత్మికోపన్యాసాలు మొదలైనవి ఆశ్రమ దైనందిన కార్యక్రమాలలో భాగంగా జరుగుతాయి.
దాదాపు అన్ని పర్వదినాలలో, ప్రత్యేక సందర్భాలలో శ్రీ సద్గురు పాదపూజ జరుగుతుంది. దసరా పండుగలో భాగంగా జరిగే నవరాత్రి ఉత్సవాలనైతే స్వయంగా పాల్గొని అనుభవించవలసిందే తప్ప మాటలలో వర్ణించడం సాధ్యం కాదు. శ్రీబాబు దివ్య సన్నిధిలో ఆశ్రమంలో ప్రతిరోజూ ఒక పండుగే అంటే అతిశయోక్తి కాదు.