శ్రీ కాళీ వనాశ్రమం

ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం

నంబూరు రైల్వేస్టస్టేషనుకు రెండు ఫర్లాంగుల దూరంలో, విజయవాడ గుంటూరు మధ్యన జాతీయ రహదారి రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంత పవిత్ర వాతావరణంలో, పచ్చని పండ్ల చెట్ల తోపులో పూల పొదరిళ్ళ మధ్యలో ఒక ఆశ్రమం వెలసింది. అదే నిరంతరం ఆధ్యాత్మిక ఉత్తేజంతో విరాజిల్లుతూ, శాంతి సంతోషాలకు నెలవుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళీ గార్డెన్స్ ఆశ్రమం. జాతీయ రహదారికి అభిముఖంగా శ్రీ రామానంద ద్వారం భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. అక్కడినుండి ఒక రహదారి శ్రీ పురుషోత్తమ ద్వారం, శ్రీ కాంతి ద్వారాలగుండా ఆశ్రమంలోనికి దారితీస్తుంది.

ఆశ్రమ విశేషాలు

ఎందరో గొప్ప ఋషులు పూర్వకాలంలో అక్కడ తపస్సునాచరించడంతో ఆశ్రమ స్థలం అప్పటికే ఎంతో పవిత్రతను సంతరించుకొంది. అలాగే కొన్ని శతాబ్దాల పూర్వమే మానవ కల్యాణార్థం మహాత్ములు ఈ స్థలంలో ఎన్నో వేదోక్తమైన యజ్ఞ యాగాదులను నిర్వహించారు. ఈ ఆశ్రమానికి ఉత్తరాన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, దక్షిణాన శైవక్షేత్రమైన పెదకాకాని మల్లికార్జున స్వామి ఆలయం విరాజిల్లుతున్నాయి. ఇలా వైష్ణవ శైవ క్షేత్రాల మధ్యలో ఆశ్రమం ఉండటం ఎంతో విశేషమైన అద్భుతం.

భక్తుల నిర్విరామ కృషితో నెలకొల్పబడిన ఈ ఆశ్రమం మే 31, 1972న ప్రారంభించబడింది. జాతి, నీతి , కుల, మత విభేదాలు లేని ఒక ఆదర్శ సామ్యవాద సమాజాన్ని ఈ ఆశ్రమంలో మనం చూడవచ్చు. ఇక్కడి భక్తులందరూ ఒకే జగన్మాత కన్నబిడ్డలవలె అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళవలె కలసిమెలసి జీవిస్తారు. ఆశ్రమాధిపతి ఆధ్వర్యంలో భక్తులచే ఏర్పడిన ధర్మకర్తల మండలి ఈ ఆశ్రమ కార్యక్రమాలను నడిపిస్తూ ఉంటుంది. మరే ఆశ్రమంలోనూ మనకు గోచరించని ఒక విశేషం ఈ ఆశ్రమానికే సొంతం. ఇక్కడి భక్తులందరూ తమ తమ కుటుంబాలతో, పిల్లాపాపలతో, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉంటారు. వారిలో పాఠశాలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థులనుంచి, ఉద్యోగస్తులు, విశ్రాంత జీవనం గడిపే వృద్ధులదాకా అందరూ ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ ఆశ్రమానికి తమ శక్తికొలది ఏదో ఒక సేవను అందిస్తూనే ఉంటారు. అలాగే ధర్మకర్తల మండలి వీరందరికి ఉచిత వసతి కల్పిస్తుంది.

శ్రీ బాబూజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఐదు దేవాలయాలు నిర్మించబడ్డాయి.

  1. శ్రీ బాబూ విజ్ఞాన మందిరం (1972)
  2. శ్రీ కోదండరామ స్వామి ఆలయం (1978)
  3. శ్రీ రాధాకృష్ణ ఆలయం (1980)
  4. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం (1981)
  5. శ్రీ మహాకాళికా పరమేశ్వరి ఆలయం (1981)
  6. శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం
శ్రీబాబు ఇక్కడి అర్చామూర్తులన్నీ కేవలం రాతి విగ్రహాలు కావనీ, అనేక సంవత్సరాల తమ తపశ్శక్తినంతా ధారపోసి ప్రతిష్టించిన సజీవ సమర్థ మూర్తులనీ ప్రకటించారు. భక్తులు చెక్కుచెదరని విశ్వాసం, నిష్టలతో ఈ మూర్తులను ఆరాధిస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయని కూడా వారు తెలియజేసారు.

డిసెంబర్ 3, 1988 - కార్తీక బహుళ దశమినాటి సాయంత్రం శ్రీ బాబూజీ తమ లీలాదేహాన్ని విడిచిపెట్టిన తరువాత 4-5-1995 శ్రీ శంకరజయంతి నాడు ప్రారంభించబడిన వారి సమాధి క్షేత్రమైన శ్రీ బృందావనం శాంతిని పొందగోరే భక్తులందరికీ తీర్థయాత్రా క్షేత్రంగా విలసిల్లుతోంది.

పరమాత్ముడొక్కడే అని, వివిధ మతాలు ఆయనను చేరుకోవటానికి వివిధ మార్గాలు నిర్దేశించాయని శ్రీ బాబు బోధించారు. కాబట్టి మతాలన్నీ ఒక్కటే. ఏ మానవుడైనా తనకు నచ్చిన ఏ మతాన్నైనా ఇతర మతాలకు హాని కలిగించకుండా అవలంబించవచ్చు. శ్రీ బాబూజీది విశ్వమతం. భగవదాసక్తి ఉన్నవారు ఏ మతానికి, లేదా ప్రాంతానికి చెందినవారైనా శ్రీబాబూజీ, శ్రీ కాళీ వనాశ్రమం వారికి ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటారు. ఏ మతానికి చెందిన ఆధ్యాత్మిక సాధకుడైనా ఆశ్రమంలో ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని ఏకాగ్రతతో ధ్యానం చేస్తే తప్పక తాను ఆశించే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడు అని శ్రీ బాబూజీ హామీ. ఆశ్రమాన్ని సందర్శించిన వివిధ మతస్తులనేకులు ఈ అనుభూతిని స్వయంగా పొందారు.

వివిధ ప్రాంతాలకు, మతాలకు, భాషలకు చెందిన అనేకమంది ఈ ఆశ్రమాన్ని సందర్శించుకొని శ్రీ బాబూజీ దర్శనాన్ని పొందారు. భాషాపరమైన అడ్డంకులెన్ని ఉన్నా వారందరూ కూడా శ్రీబాబుజీతో సుదీర్ఘమైన ఆధ్యాత్మిక చర్చలు జరిపి సంతృప్తిని చెంది మరీ వెళ్లారు.

ఇరవయ్యవ శతాబ్దంలోని ఎనిమిదవ దశాబ్దం ఈ ప్రపంచానికి చాలా గడ్డుకాలమని శ్రీ బాబు భావించారు. దుష్టశక్తుల ప్రభావం నశించి సమస్త మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే మహాదశయంతో వారు మూడు మహాయాగాలను తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. అవే

  1. 1975 లో శ్రీ దేవీ శతచండీ యాగము
  2. 1978లో శ్రీ పాశుపత వజ్ర గ్రథిత మహా మృత్యుంజయ సంపుటిత మహా రుద్ర యాగము
  3. 1982లో శ్రీ సగ్రహ మఖ, పుత్రకామేష్టి, మహాలక్ష్మీ యాగ సహిత శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక యాగము

అలా దాదాపు అర్థశతాబ్దం పాటు తమ సందేశాన్ని ప్రపంచం నలుమూలలా చాటి మానవాళికి విశేష సేవనొనర్చిన శ్రీబాబు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరినదని నిర్ణయించుకొని కార్తీక బహుళ దశమి (డిసెంబర్ 3, 1988) నాటి సాయంత్రం తమ పాంచభౌతిక దేహాన్ని విసర్జించారు.

అది సర్వ మానవజాతికి విషాదక్షణం; వారి గమ్యస్థానాలను నిర్దేశించే మరొక గురుదేవులు నిష్క్రమించిన క్షణం. కానీ వారు ఎక్కడికి వెళ్లారు? అణువులో అణువుగా ఇమిడిపోతూ బ్రహ్మాండమంతా వ్యాపించిఉన్న బ్రహ్మమనే నామధేయంతో పిలువబడే సర్వాధిష్ఠాన చైతన్యం వారే కదా ? అవును, తప్పకుండా . కనుక మనం వారిని సృష్టిలోని అణువణువులో నిండి ఉండి సర్వాన్ని నడిపించే సర్వాధిష్ఠాన చైతన్యమైన బ్రహ్మగా యెఱిఁగి ఆరాధించుకోవాలి .

పైన చెప్పిన మూడు యాగాలు నిర్వహించేటప్పుడు శ్రీబాబు యజ్ఞశాలలోని ప్రధాన హోమగుండం వైపు చూపిస్తూ అదే తమరి స్వస్థానం అని సూచించేవారు. అందుకనుగుణంగానే శ్రీ బాబూజీవారి పార్థివ శరీరాన్ని అఖండ నామసంకీర్తన, వేదఘోషల నడుమ డిసెంబర్ 7, 1988 నాడు అదే స్థలంలో నిర్మించిన పాలరాతి సమాధిలో నిక్షిప్తం చేయడం జరిగింది.

అక్కడ ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మించుకోవాలని భక్తులందరి దృఢ సంకల్పంతో ఇప్పుడక్కడ "బృందావనం" అనే పేరుతో ఒక సుందరమైన పాలరాతి స్మృతిచిహ్నం వెలసింది. మే 4, 1995న బృందావనంలో శ్రీ బాబు పాలరాతి విగ్రహం ప్రతిష్టించబడింది. ఆ బృందావన నిర్మాణంలో భక్తులందరూ హృదయపూర్వకంగా తమ తమ సేవలను అందించారు. ఇప్పుడా బృందావనమే భక్త హృదయమై నిలచింది.

శ్రీ బాబు భక్తులకు తాము వ్రాసే ఉత్తరాలలో "మీ హృదయ బాబు" అని సంతకం చేసేవారు. వారెప్పుడూ తమ భక్తుల హృదయాలలో నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటారు.

శ్రీ బాబు మహాసమాధి పొందిన నాటినుండి ప్రతి సంవత్సరం కార్తీక బహుళ తదియ నుండి బహుళ దశమి వరకు సప్తహ్నిక దీక్షతో శ్రీ స్వామివారి ఆరాధనా మహోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. అంతేకాక ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి, బహుళ దశమికి శ్రీ సద్గురు పాదపూజ, సత్సంగం నిర్వహింపబడతాయి.